Site icon NTV Telugu

KTR : కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది

Ktr

Ktr

ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నామని, వాటికి శాశ్వత పరిష్కారం కావాలంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి రావాల్సిందేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో హమాలీ బస్తీ వాసులు నిర్వహించిన బొడ్రాయి పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా హాజరయ్యారు.

హమాలీ బస్తీ ప్రజలు నేతలకు ఘన స్వాగతం పలికి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ పల్లెటూర్లలో నిర్వహించే బొడ్రాయి పండుగను నగరంలో కూడా సంప్రదాయంగా జరపడం ఆనందకరమన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. సనత్‌నగర్‌తో పాటు మొత్తం హైదరాబాద్‌లో ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలిచే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ప్రశంసించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాలి అంటే కారు గుర్తుకు ఓటేయండి” అని పిలుపునిచ్చారు. నవంబర్‌ 11న జరిగే ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లోని తమ బంధువులు, స్నేహితులకు కూడా కారు గుర్తుకు ఓటేయమని చెప్పాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పద్మారావు నగర్ ఇన్‌చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, సునీత, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, కొలన్ బాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. హమాలీ బస్తీ వాసులు సత్యనారాయణ, సుభాష్, యాదగిరి, రవి, కుషాల్, వెంకటేశ్‌, సంపత్ తదితరులు పండుగ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Exit mobile version