Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 6: కమనీయం కడు రమణీయం సీతారాముల కళ్యాణం

Sitarama Kalyanam

Sitarama Kalyanam

Koti Deepotsavam 2025 Day 6: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక ప్రకాశంతో తళుక్కుమంది. భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఆరవ రోజు అద్భుతమైన భక్తి తరంగాలతో సాగింది. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవం, ప్రతిరోజూ భక్తులకు ఆత్మీయమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.

2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ ఆధ్యాత్మిక యజ్ఞం, ఇప్పుడు ప్రపంచస్థాయిలో భక్తి ఉత్సవాలకు ప్రతీకగా నిలిచింది. వేలాది మంది భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో దీపాలు వెలిగించగా, వేదికపై ఏర్పడిన ఆ వెలుగుల సముద్రం కైలాసాన్ని తలపించింది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే సందేశం మరింత హృదయాలను తాకింది.

ఆరవ రోజు కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక వైభవం మరింత అద్భుతంగా కనిపించింది. పూజ్యశ్రీ విశ్వప్రసన్నతీర్థ మహాస్వామీజీ (పెజావర్ మఠం, ఉడుపి), పూజ్యశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ (కాశీ జగద్గురు) ఆధ్వర్యంలో జరిగిన అనుగ్రహ భాషణం భక్తుల మనసులను దోచుకుంది. బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి ప్రవచనామృతం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం అలరించింది.

వేదికపై కొండగట్టు ఆంజనేయ స్వామికి కోటి తమలపాకుల అర్చన, భద్రాచలం శ్రీరామ మహాపూజ, యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామివారి కల్యాణం, భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి. చివరగా హనుమంత వాహన సేవ, సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో ఆరవ రోజు ఉత్సవం కన్నుల పండువగా ముగిసింది.

ఈ పవిత్ర ఉత్సవం నవంబర్ 13 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా సాగుతున్న కోటి దీపోత్సవం 2025 భక్తులందరికీ జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది.

Exit mobile version