Site icon NTV Telugu

Kotakonda Festival: కొత్తకొండ జాతరకు పోటెత్తిన భక్తులు.. నేడు ఎడ్లబండ్ల రథాల ఆలయ ప్రదక్షణ

Kotakonda Jatara

Kotakonda Jatara

Kotakonda Festival: పచ్చని పంట పొలాల నడుమ కోటకొండలోని గుట్టపై వెలసిన వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. వీరభద్రస్వామి చేతిలో కత్తి, రక్తపు కిరీటం, కోరమీసాలతో వచ్చే భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోటకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భోగి పండుగ రోజు కడిపికొండ, దామెర కుమ్మరి వంశస్థులు సంప్రదాయం ప్రకారం కుమ్మరి (వీర) బోనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. శివసత్తుల నృత్యాలు, వీరశైవుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బోనంతో వెళ్లిన కుమ్మరులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ గండాలను వదిలించుకోవడానికి గండ దీపం వద్ద నూనె పోశారు. స్వామి వారి కోరికలు తీర్చేందుకు కోరమీలను సమర్పించారు. వారు కోడెలను చెల్లించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బీజేపీ నాయకులు బొమ్మ శ్రీరామచక్రవర్తి, రావుపద్మ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌లు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ మకర సంక్రాంతి రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సోమవారం ఎడ్లబండ్ల రథాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయనున్నారు.

Read also: Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..

ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కాగా.. ఈ నెల 14న భోగి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ (15న) మకర సంక్రాంతి వేడుకలు, 17న త్రిశూల స్నానం, 18న అగ్నిగుండాలు, సాయంత్రం స్వామివారి గ్రామ సందర్శనతో వేడుకలు ముగుస్తాయి. జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. ఇక వీరన్న జాతరకు వచ్చే భక్తుల కోసం హుజూరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, వరంగల్-1 డిపోలకు చెందిన 80 బస్సు సర్వీసులను మూడు రోజుల పాటు నిరంతరంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారి ద్వారా ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు నడిపేలా చర్యలు తీసుకున్నారు. జాతరకు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో పారిశుధ్య సమస్య తలెత్తకుండా 150 మంది కార్మికులతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు. కోటకొండ జాతరకు 400 మంది పోలీసులు సేవలందించనున్నారని ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్ కుమార్, ములుకనూరు ఎస్ ఐ సాయిబాబు తెలిపారు. డీసీపీ అబ్దుల్ బారీ, కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా బృందం, షీ టీమ్స్, క్రైమ్, టాస్క్ ఫోర్స్ బృందాలు బందోబస్తులో పాల్గొంటాయి. ఉన్నత పాఠశాలలో పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు రోడ్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోతాయి. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి 50 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు.
Mayawati Birthday: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..

Exit mobile version