Komatireddy Venkat Reddy Put Condition To Participate In Munugodu Election Campaign: కొంతకాలం నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న అనూహ్య పరిణామాలతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరు పట్ల ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోనియా గాంధీ కలవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరించడంతో పాటు పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానక పరిస్థితుల గురించి తెలియజేయడం కోసం సోనియా వద్దకు వెళ్తున్నానని, అందుకే ఆమె అపాయింట్‌మెంట్ కోరానని అన్నారు. ఇదే సమయంలో.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారం చేయడం కోసం తాను సిద్ధమని ప్రకటించారు. అయితే.. అందుకు ఒక కండీషన్ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు స్టార్ క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తేనే, ప్రచానికి వస్తానని ఆయన అన్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా సోనియా గాంధీని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరినట్టు తెలుస్తోంది. టీపీసీసీలో జరుగుతున్న పరిణామాల్ని వివరించేందుకు, ఆయన సోనియాను కలిసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. అంతకుముందు రేవంత్ రెడ్డి చర్యల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ కూడా రేవంత్‌కు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. వీళ్లిద్దరు రాష్ట్రంలోని పరిస్థితులపై హైకమాండ్‌కి తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే పరిస్థితిని నేరుగా సోనియాకు వివరించాలని ఆయన నిర్ణయించారు.
