Komatireddy Venkat Reddy Counter To Revanth Reddy: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలందరూ పాల్గొంటుండగా.. తాను మాత్రం ప్రచారానికి వెళ్లబోనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాంధీభవన్‌కు వెళ్లిన ఆయన.. తాను హోంగార్డు లాంటి వాడినని, మునుగోడు ప్రచారానికి ఎస్పీ స్థాయి నేతలే వెళ్తారని, తమతో పని లేదని అన్నారు. తనపై వంద కేసులు పెట్టినా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చెప్పిన నాయకుడే మునుగోడులో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పారు. గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి హోంగార్డులని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా.. తాను మాత్రం మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లేదే లేదని వెంకట్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు.
ఇదే సమయంలో.. టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిపై కూడా వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన గురించి మాట్లాడేంత స్థాయి శ్రీహరికి లేదని, తాను విదేశాలకు ఎప్పుడు వెళ్లాననే విషయాల గురించి మంత్రి కేటీఆర్‌ను అడగాలని సూచించారు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారని మీడియా ప్రశ్నించగా.. ‘ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేశామనేది చెప్తామా? అలా చెప్పడం చాలా పెద్ద తప్పు’ అంటూ బదులిచ్చారు. కాగా.. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రావడంపై కోమటిరెడ్డి బ్రదర్స్ గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో.. హోంగార్డులు ఎప్పటికి అలానే ఉంటారని, ఎస్పీలు కాలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీలు డైరెక్ట్‌గా వస్తారని.. తమను కాదని ఎస్పీ ఎలా వస్తారంటూ హోంగార్డులు ప్రశ్నిస్తారా? అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గతంలోనే తీవ్రంగా రియాక్ట్ అయిన వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు మరోసారి పైగా విధంగా కౌంటర్ ఇచ్చారు.