NTV Telugu Site icon

Komatireddy: కోమటిరెడ్డిలో కన్ఫ్యూజన్. ఎన్నాళ్లిలా?..

Komatireddy

Komatireddy

Komatireddy: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. నల్గొండ జిల్లాలో ఆ సోదరులకు మంచి ఫాలోయింగ్‌ ఉందని చెబుతారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. రేవంత్‌రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్‌ని చేసినప్పటి నుంచి వీళ్లద్దరూ బాగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనిపిస్తోంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించటంతో ఆయన కాస్త వెనక్కి తగ్గినట్లున్నారు.

ఇక, రాజగోపాల్‌రెడ్డి విషయానికొస్తే ఆయన నిన్న ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీఆర్‌ఎస్‌ని ఓడించే సత్తా బీజేపీకే ఉందని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పారు. నిన్న కూడా అన్నారు. అలాంటప్పుడు ఆయన ఆ పార్టీలోకే పోవచ్చు కదా అని జనం అనుకుంటున్నారు. పార్టీ మారాల్సి వస్తే నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ని ఓడించే సత్తా లేనప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగటం దేనికి అని అడుగుతున్నారు.

read also: Raviteja: ‘స్వయంవరం’ నేను చేయాలి.. కానీ మిస్ అయ్యింది

చక్కగా బీజేపీలోకే వెళ్లి అక్కడ మంత్రి పదవి చేపట్టి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించిన రాజగోపాల్‌రెడ్డి అదే విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాని కలిసి మాట్లాడినట్లు వెల్లడించారు. కానీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి ఈ ‘అప్పుల’ అంశాన్ని ఆమెతో చర్చించి ఆందోళన చేపట్టకుండా అమిత్‌షాని కలిసి చర్చిస్తే పార్టీకి ఏం ప్రయోజనం అనేది అర్థంకావట్లేదు.

పైగా ఆయన సోనియా గాంధీని కాదని, అమిత్‌షాతో భేటీ అవటం తాను అభిమానిస్తున్నానని చెబుతున్న కాంగ్రెస్‌ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గ్రహించలేకపోయారా?. నేను యుద్ధం మొదలుపెడితే విజయమో వీర మరణమో తప్ప మధ్యలో వెనక్కి వచ్చేది లేదని రాజగోపాల్‌రెడ్డి గొప్ప ప్రకటన చేశారు. అయితే ఆ యుద్ధం ఎవరి మీదనే క్లారిటీ లోపించింది. ఇటు కాంగ్రెస్‌ పార్టీలో మనస్ఫూర్తిగా ఉండలేక, అటు బీజేపీలోకి జల్దీగా వెళ్లలేక గోడ మీద పిల్లి(గోపి)లా ఉంటే ప్రజలు ఎలా నమ్ముతారు.

ఒకవేళ రాజగోపాల్‌రెడ్డి హస్తం పార్టీలోనే కొనసాగితే, మళ్లీ ఎమ్మెల్యేగా గెలిస్తే, ఆయన చెబుతున్నట్లు రేప్పొద్దున తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రి అయ్యే ఛాన్స్‌ ఉండదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ మారితే పబ్లిక్‌లో పలుచన అవుతారు. తనను, పార్టీని నమ్మి ఓటేసినవాళ్లను మోసం చేసినట్లు అవుతుంది. పైకి అలా చెబుతున్నారు గానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేంత సీన్‌ లేదనే ఉద్దేశంతోనే ఆ పార్టీలోకి జంప్‌ చేయకుండా ఉండిపోతున్నారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

అటో ఇటో దూక్కుండా గోడ మీదే ఉంటూ ఇలా పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేస్తే అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తారేమో గానీ భవిష్యత్‌ ఎన్నికల్లో మునుగోడులో మునిగే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలవకముందు 2018 శాసన సభ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో ఓడిపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.