NTV Telugu Site icon

Jupally V/S harshavardhan: కొల్లాపూర్‌ లో హైటెన్షన్.. మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

Kollapur

Kollapur

కొల్లాపూర్ లో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజ‌కీయ హీట్ ఉత్కంఠ‌ రేపుతుంది. కొల్లాపూర్ లో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. నేత‌లిద్ద‌రూ అధికార గులాబీ పార్టీకే చెందిన‌వారే అయితే వీరిద్ద‌రూ ఓపెన్ ఛాలెంజ్ చేసుకోవ‌డం చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మంటూ ఒక‌రిపై మ‌రొక‌రు ఛాలెంజ్ విసురుకోవ‌డంతో.. ఆదివారం కొల్లాపూర్ లో టెన్ష‌న్ వాతావ‌ర‌నం నెల‌కొంది. నిన్న (శ‌నివారం) రాత్రికి రాత్రే ఇద్ద‌రు నేత‌లు కొల్లూపూర్ చేరుకోవ‌డంతో వాతావ‌ర‌ణం హీట్ ఎక్కింది. అయితే ఈక్ర‌మంలో అల‌ర్ట్ అయిన పోలీసులు చ‌ర్చ‌ల‌కు, ర్యాలీల‌కు అనుమ‌తి లేదంటూ హెచ్చ‌రికలు జారీ చేశారు. ఒక‌వేళ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘిస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

ఇదిలా వుంటే జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుంచే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. నేడు ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు నలుగురు అనుచరులు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద కూడా పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్ద‌రు నేత‌లు బ‌య‌ట‌కు రాకుండా ఇంటికే ప‌రిమితం చేసిన‌ట్లు స‌మాచారం.

కాగా.. కొంత కాలంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది. టీఆర్ ఎస్ కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జూపల్లి కృష్ణారావు పని చేసిన ఆయ‌న‌ 2018 ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత బీరం టీఆర్ఎస్ కండువాక‌ప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి జూపల్లి, బీరం మధ్య విభేదాలు కొనసాగుతు వ‌స్తున్నాయి. ఒకరిపై మ‌రొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూవ‌స్తున్నారు.

నేత‌లు ఒక‌రినొక‌రు అభివృద్ధి విషయంలో నువ్వా నేనా అన‌ట్టు స‌వాళ్లు విసురుకున్నారు. ఈమ‌ధ్య కాలంలో ఇది మరింతగా ముదిరి చ‌ర్చ‌కు దారితీసింది. వీరిద్ద‌రి నేత‌ల వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరింది. టీఆర్ ఎస్‌ పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు ఏం నిర్వ‌హించినా కొల్లాపూర్ నియోజకవర్గంలో గొడవలకే దారితీస్తోంది. అభివృద్ధిపై తనతో చర్చకు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలనిజూపల్లి సవాల్ చేయగా.. బీరం కూడా సై అన‌డంతో వాతావ‌ర‌ణం హీట్ ఎక్కింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముంద‌స్తు చ‌ర్య‌లో భాగంగా ఎటువంటి అవాంఛిత గొడ‌వ‌కు తావులేకుండా.. నేత‌లిద్ద‌రిని ఇంటికే ప‌రిమితం చేసి 144 సెక్ష‌న్ విధించారు.