2018లో ధరణి సర్క్యులర్, 2020లో చట్టం తీసుకు వచ్చారని, తర్వాత మంత్రుల కమిటీ కూడా వేశారన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కాకపోగా ఒకదాని కు మరొదనికి సంబందం లేదని, ధరణి చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయన్నారు. భూమి హక్కు విషయంలో గతంలో సమర్థవంతంగా ఉన్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ హక్కు హరించి పోయిందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప గతంలో హక్కులకు ఇబ్బందులు లేవని, వేల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతుబందు వచ్చింది కానీ చిన్న, సన్నకారు రైతులకు రైతు బంధు రాలేదన్నారు. భవిష్యత్ లో మళ్ళీ ఇబ్బందులు రాకుండా హక్కుదారు పేరు ఆన్లైన్ లో ఉండాల్సిందేనని, 2018 వరకు హక్కు పుస్తకం ఉంది. భూమి హక్కును మళ్ళీ అందిస్తామని ఆయన వెల్లడించారు. పటిష్టమైన రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఆరు సంవత్సరాలుగా లక్షల మంది రైతులు హక్కు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తొందరలోనే మధ్యంతర నివేదిక ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందన్నారు కోదండ రెడ్డి. భూ రికార్డులను సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ధరణి కమిటీ సభ్యులు రేమండ్ పీటర్ మాట్లాడుతూ.. ‘ఈరోజు మూడో సమావేశం జరిగింది. అన్ని అంశాలపై చర్చించాము. రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాము. గ్రామాల్లో పర్యటిస్తాం, మీసేవ కేంద్రాల్లో సమస్యలు కూడా తెలుసుకుంటాము. అగ్రికల్చర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారితో కూడా చర్చిస్తాము. మరికొన్ని సమావేశాల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. అందరి అభిప్రాయాలను సేకరిస్తాం. ధరణి వచ్చిన తర్వాత తొందరగా చేయాలని ఉద్దేశ్యం మంచిదే కానీ లోటు పాట్లు లేకుండా చూసుకోవాల్సి ఉండే. తహసీల్దార్, ఆర్డీవోలతో కూడా చర్చిస్తాం. సమస్యల పరిష్కారం చేయడం కోసం కమిటీ కాదు. ధరణిని బలోపేతం చేయడానికి కమిటీ కాదు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం ఉంది. మా రికమెండేషన్స్ ప్రభుత్వంకు ఇస్తాం. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం. ధరణి సమస్యలతో పాటు రెవెన్యూ వ్యవస్థ లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతాం. ధరణి సమస్యలపై ఇతర రాష్ర్టాల్లో కూడా పర్యటిస్తాం.’ అని ఆయన అన్నారు.
తర్వాత ధరణి కమిటీ సభ్యులు సునీల్ మాట్లాడుతూ.. ‘భూమి సమస్యలు చాలా క్లిష్టమైనవి. దేశ వ్యాప్తంగా భూముల రికార్డులను కంప్యూటరైజ్డ్ చేస్తున్నారు. కంప్యూటర్ సమస్యలు పరిష్కరించాలి కానీ కొత్త సమస్యలు సృష్టించకూడదు. 80వ దశకంలోనే రంగారెడ్డి జిల్లా కంప్యూటరైజ్డ్ రికార్డుల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక అయ్యింది. కంప్యూటర్ రికార్డులు వాస్తవానికి అద్దం పట్టేలా ఉండాలి. భూ పరిపాలనకు సంబంధించి కూడా అభిప్రాయాలను కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ధరణి కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వడానికి కొంత ఆలస్యం కావొచ్చు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
