NTV Telugu Site icon

Kishan Reddy : రేపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్న కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy

కేంద్రప్రభుత్వం రూ.715 కోట్లతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రధానమంత్రి చేతుల మీదుగా.. ఈ రైల్వే స్టేషన్‌ ను అట్టహాసంగా ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణమధ్యరైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

మొత్తం మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులను సంకల్పించగా.. మొదటిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బుధవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించనున్నారు. పనులు జరుగుతున్న తీరును దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే కేంద్రస్థానమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో.. విమానాశ్రయం స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.715 కోట్లను కేటాయించింది. రైల్వేస్టేషన్ ఆధునీకరణతోపాటుగా.. స్టేషన్‌కు నలువైపులా రోడ్ల వెడల్పు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిశ్చయించింది.