Site icon NTV Telugu

Kishan Reddy : ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం (8th Pay Revision Commission) విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన స్పందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నినాదం ఆధారంగా దేశంలోని ప్రతి వర్గం సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కృషికి సరైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.

వేతన సవరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉత్పాదకత పెరిగి ప్రజా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడటం ద్వారా దేశీయ వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన పేర్కొంటూ – “మోదీ గారు నాయకత్వం వహించిన తర్వాత 2016లో 7వ వేతన సవరణ కమిషన్ ద్వారా ఉద్యోగులకు అనుకూలమైన సంస్కరణలు తీసుకువచ్చారు.

2006లో జరిగిన 6వ పీఆర్సీలో కనీస వేతనం రూ.7 వేలుగా ఉండగా, 7వ పీఆర్సీలో దాన్ని రెండున్నర రెట్లు పెంచి రూ.18 వేలుగా నిర్ణయించారు. అంతేకాకుండా, కనీసం 3 శాతం ఇంక్రిమెంట్‌ తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం కూడా మోదీ ప్రభుత్వంలోనే తీసుకున్నారు” అని గుర్తుచేశారు. ఇప్పుడు 8వ పీఆర్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిన్ని మార్పులు తీసుకువచ్చిందని, ఈ నిర్ణయం ద్వారా 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి ద్విగుణీకృత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?

Exit mobile version