హైదరాబాద్ శంషాబాద్ శివారులో సమతా విగ్రహాన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే సమతా విగ్రహం తయారీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రచారం చేసుకుంటోందని… సమతా విగ్రహాన్ని చైనాలో తయారుచేశారని.. ఆత్మనిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడటమా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సమతా విగ్రహం తయారీకి, బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 8 ఏళ్ల క్రితమే రామానుజాచార్యుల విగ్రహం తయారీ ప్రారంభమైందని, ఆ సమయంలో కేంద్రంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. విగ్రహం తయారీకి అవసరమైన నిధులన్నీ ప్రైవేటుగా సమకూర్చినవే అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వకముందే విగ్రహం తయారీ ప్రారంభమైందని, రాహుల్ గాంధీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకున్న పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.
