సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది.
ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు, పోలీసు అధికారులను తమ వారిని పెట్టుకుంటూ ఇష్టారీతితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. పోలీసు అధికారులు కూడా కొందరు లీడర్లు ఎవరి మీదయినా కాస్కో అంటే కేసులు పెట్టేస్తున్నారు. ఇలాంటి ధోరణితో పరిపాలన మీద ప్రభావం పడుతుంది. ఇక్కడ అధికార పార్టీకి అడుగులు మడుగులు వత్తకపోతే వ్యక్తిగతంగా, వ్రుత్తిగతంగా ఇబ్బంది తప్పవని పోలీసులు డిసైడయ్యారు. బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియలు, ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీల నియామక వ్యవహారాల్లో ఉన్నతాధికారులు ఇంటిలిజెన్సు ద్వారా నివేదికలు తెప్పించుకుని, వారి పనితీరు ఆధారంగా పోస్టింగ్‌లు ఇచ్చే పద్ధతి ఎప్పుడో పోయింది. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండేవారికి పోస్టింగ్‌లు కల్పించే కాలం. నేతల మద్దతుతో పోస్టింగ్ లు సంపాదించుకున్న వారు, ఆ నేతల కోసమే పని చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కొందరు పోలీసులైతే ప్రజల శాంతిభద్రతల కంటే ఎమ్మెల్యే లు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పలుకు బడి ఉన్న నాయకుల కోసమే అన్నట్లుగా ఉంటున్నారట.
ఖమ్మం జిల్లాలో ఈ వ్యవహారం చాలా దారుణంగా ఉంది. పోలీసు అధికారులు కొందరైతే, తమ మీద మరక మంచిదేలే అన్నట్లుగా ఉన్నారట. తాము పలానా ఎంఎల్ఎ , పలానా మంత్రి మనిషని చెప్పుకోవడానికి ఇష్ట పడుతున్నారట. అలాంటి మరక పడితేనే తమకు పోస్టింగ్ లు వస్తాయన్న నమ్మకమట. దీంతో వ్యవస్థ అధ్వాన్నంగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో ఎంఎల్ ఎ లకు అనుంగు అనుచరులుగా రక్షకభటులు పని చేస్తున్నట్టుందన్న విమర్శలు పని చేస్తున్నారంట. ఖమ్మం సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఎంఎల్ఎ ఆ ప్రాంతానికి వస్తే అక్కడి పోలీసు అధికారి వచ్చి ప్లేట్ లో భోజనం పెడుతున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విమర్శలు వస్తే మంచిదే అన్న కోణంలో ఉన్నారు సదరు పోలీస్. తాము పలానా ఎంఎల్ఎ కు అనుకూలంగా పని చేస్తామన్న పేరు ఉంటే ఇక పోస్టింగ్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఫిక్స్ అయ్యారట.
ఖమ్మం జిల్లాకి చెందిన బీజేపీ అనుబంధ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారంతో పోలీసుశాఖపై అపవాదు పెరిగింది. సాయిగణేష్ స్టేషన్ వద్దే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే సాయిగణేష్‌పై 8కి పైగా కేసులు ఉండడం, రౌడీషీట్ తెరవడం, ఆయన ఆత్మహత్య సంఘటనలో కీలకంగా మారాయి. ఖమ్మం, పాలేరు , వైరా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల మీదనే కేసులు పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అయితే అదే పార్టీలో ప్రత్య్ధుర్ధులు ఉన్నప్పటికీ, వారి మీద ఎప్పుడూ కేసులు పెట్టేవారు కాదు.
ఇప్పుడు మాత్రం అధికార పార్టీలో అదే పార్టీకి చెందిన వారు అయినప్పటికీ, ప్రత్యర్ధి అయితే చాలు వారి మీద కేసులు పెట్టడం సర్వ సాధారణంగా మారింది. మాజీ మంత్రి తుమ్మల వర్గీయులపై, మాజీ ఎంఎల్ఎ మదన్ లాల్ వార్గీయులపై కేసులు నమోదు అయ్యాయి. ఇంకా చెప్పాలంటే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీద కూడ కేసులు పెట్టేవిధంగా ఆ పార్టీకి చెందిన వారు ఒత్తిడి చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
మరో వైపున ఖమ్మం కాంగ్రెస్ కార్పోరేటర్ల కు సంబంధించిన వారిపై కూడా కేసులు భారీగా పెడుతున్నారు. కార్పొరేటర్ ల భర్తలిద్దరి మీదా కేసులు మోపారు. ఒక్కరి మీద ఏకంగా పిడి యాక్టు కూడ పెట్టారు. మట్టి అక్రమ దందా మీద పోరాడిన గిరిజన నాయకుడు బద్రు నాయక్ మీద కూడ కేసు పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ గిరిజన నాయకుడు అయితే రోడ్డు మీద అయిదు రూపాయల భోజనం తింటూ ఉంటాడు. అటువంటి సామాన్య వ్యక్తి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
ఇకపోతే సోషల్‌మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టిన మహిళపైనా కేసులు పెట్టి వేధించారన్న విషయం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. పాలేరు నియోజకవర్గంలో మాజీమంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న వార్‌లో కూడా పోలీసులు ఎమ్మెల్యేపక్షం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తుమ్మల వర్గానికి చెందిన నేలకొండపల్లి టీఆర్‌ఎస్ నాయకుడిపై రౌడీషీట్ తెరవడం, ఖమ్మంరూరల్ మండలంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఇటీవల 24 మందిపై కేసు పెట్టి అరెస్టు చేయడం, ఇదే మండలంలో మాజీసర్పంచపై పొలిటికల్ ప్రెషర్‌తో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేసి అరెస్టు చేయడం లాంటివి నిదర్శనం.
తిరుమలాయ పాలెం మండలంలో కూడా తుమ్మలవర్గీయులపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పాలేరు నియోజకవర్గంలో మరికొందరిపైనా కేసులు నమోదుచేసేందుకు పోలీసులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎంఎల్ఎ, ప్రజా ప్రతినిధి ఇంటి నుంచి బయటకు వెళ్తే, మళ్లీ ఇంటికి వచ్చే వరకు పోలీసు అధికారులు కాపలాగా, వారి వెంటనే ఉండాల్సిన పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలకొన్నదట. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత, సున్నిత ప్రాంతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పర్యటించినప్పుడు మాత్రమే, రక్షణగా ఉండే ఎస్‌ఐలు, సీఐలు, పోలీసులు., ఇప్పుడు ఏకంగా ప్రతీ చిన్న పర్యటనకు కూడా కాన్వాయ్‌లా ఉంటూ ప్రత్యేక ప్రొటోకాల్ పాటిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఈ పరిస్థితులు పోలీసుశాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
Read Also: Amit Shah Phone to Sai Ganesh Family: సాయి గణేష్ కేసు.. రంగంలోకి అమిత్‌షా..!