Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి

  • సెప్టెంబర్ 12 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాన మార్గాల్లో వాహనాల మళ్లింపు ఖైరతాబాద్‌లో రద్దీ ప్రాంతాలు ఇవే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు
Bada Ganesh

Bada Ganesh

Bada Ganesh : ఖైరతాబాద్ ప్రతిష్ఠాత్మక బడా గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24 వరకు ప్రతిరోజూ ఉదయం 11:00 గంటల నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్ వెల్లడించారు.

వాహనాల మళ్లింపులు సాగే మార్గాలు

భక్తుల రద్దీ దృష్ట్యా ప్రధాన జంక్షన్ల వద్ద సాధారణ ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. వీవీ విగ్రహం వైపు నుండి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు; వీటిని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు. పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుండి రాజ్ దూత్ లేన్ మీదుగా బడా గణేష్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.

అలాగే ఇక్బాల్ మినార్ వైపు నుండి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్డు వైపు, నెక్లెస్ రోటరీ వైపు నుండి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద సెక్రటేరియట్ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు. నిరంకారి వైపు నుండి ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ జంక్షన్ వైపు మళ్లించనున్నారు.

తీవ్ర రద్దీ ఉండే ప్రాంతాలు

ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్, షాదాన్ కాలేజ్, అయోధ్య, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ జంక్షన్, నెక్లెస్ రోటరీ, కేసీపీ జంక్షన్ , మాసాబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. సాధారణ ప్రయాణికులు ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించడం శ్రేయస్కరం.

పార్కింగ్ వసతులు, హెల్ప్‌లైన్

గణనాథుని దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుండి వచ్చే భక్తులు తమ వాహనాలను రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలం లేదా ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేయవచ్చు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుండి వచ్చే భక్తులకు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అత్యవసర ప్రయాణ వేళల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.