NTV Telugu Site icon

BJP V/s TRS: ముచ్చటగా మూడోసారి.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్ గైర్హాజరు

Modi Kcr

Modi Kcr

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా..నేనా..అన్న రీతిలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం హైదరాబాద్ లో జరుగుతుండటం మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఆపరేషన్ తెలంగాణలో భాగంగానే బీజేపీ తన అత్యున్నత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు టీఆర్ఎస్ కూడా బీజేపీకి కౌంటర్ గా ఫ్లెక్సీ వార్ స్టార్ట్ చేసింది. బీజేపీకి ధీటుగా, ప్రధానం మోదీ వెళ్లే మార్గాల్లో కటౌట్లు, ప్లెక్సీలతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. వీరి రాక కన్నా ముందుగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ప్రచారం కొరకు హైదరాబాద్ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా తన మంత్రులతో వెళ్లి యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోనున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర సీఎం హోదాలో కేసీఆర్ ఆహ్వానించాలి.. కానీ గడిచిన మూడు పర్యయాల్లో ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు కేసీఆర్ వెళ్లలేదు. తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు మోదీని రిసీవ్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఆ తరువాత మేలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా జాతీయ కార్యవర్గ సమావేశం కోసం హైదరాబాద్ రానున్నారు మోదీ. ఈ మూడు సందర్బాల్లో కేసీఆర్ మోదీని ఆహ్వానించలేదు. ఈ ప్రోటోకాల్ వివాదం ఇరు పార్టీల మధ్య విమర్శలకు తావిచ్చింది. ఇటీవల కాలంలో మోదీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, పీఎం మోదీపై నేరుగా అటాక్ చేస్తున్నారు. తాజాగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు.