తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ కిట్’ పథకం సూపర్ డూపర్ హిట్ అయిందని సీఎం కేసీఆర్ పలుమార్లు పేర్కొన్నారు. 2017లో ప్రారంభమైన ఈ స్కీమ్‌లో భాగంగా 2022 ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు పైగా కిట్లను అందజేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కిట్‌లో మరిన్ని ఐటమ్స్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం అయిన మహిళకు, పుట్టిన బిడ్డకు ఈ కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు డబ్బులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
ఇందులో చీర, టవల్, నాప్‌కిన్, బేబీ డ్రస్, హ్యాండ్ బ్యాగ్, డైపర్లు, పౌడర్, శాంపూ, సబ్బు, బేబీ ఆయిల్, దోమల వల, ఆడుకునే బొమ్మలు, ఐరన్ మాత్రలు, ప్రొటీన్ పౌడర్ తదితరాలను ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డెలివరీలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి తగ్గట్లే ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్కారీ దవాఖాన్లలో ప్రసవాలు పెద్ద సంఖ్యలో పెరిగాయి. ఈ ఉత్సాహంతో కేసీఆర్ గవర్నమెంట్ ఈ స్కీమ్‌ని మరింత ఆకర్షణీయంగా మలచనుంది.
ఇందులో భాగంగా అధిక పోషకాలు ఉండే ఖర్జూరాలను ఇవ్వనున్నారు. వీటిని తింటే తల్లికి బలవర్ధకమైన ఆహారం అందుతుంది. ఖర్జూరాల్లో పీచు, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, కాపర్, విటమిన్ బీ6 అందుతాయి. ఖర్జూరాలతోపాటు అస్టిఫెర్జ్-జెడ్ అనే సిరప్‌ను కూడా అందిస్తారు. ఈ టానిక్ తాగితే అమైనో యాసిడ్స్, విటమిన్లు, జింక్ లభిస్తాయి. ప్రొ-పీఎల్ అనే పౌండర్‌నీ ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ప్రొటీన్, హిమోగ్లోబిన్ బూస్టర్లు, ఎముకలు బలపడే పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పెరుగుతాయి.