NTV Telugu Site icon

Pathipaka Mohan: కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి పత్తిపాక మోహన్‌ ఎంపిక

Pathipaka Mohan

Pathipaka Mohan

Pathipaka Mohan: కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికయ్యారు. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్‌ రాసిన ‘బాలలతాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.

ఈ పురస్కారానికి డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని సీఎం అన్నారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీర్తి శేషులు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి శిష్యుడైన, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన, పత్తిపాక మోహన్.. సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

Hyderabad Old City: పాతబస్తీలో హై టెన్షన్.. రంగంలోకి ఆర్ఏఎఫ్ బలగాలు

బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు పత్తిపాక మోహన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం మన కవులు, బాలలతాత బాపూజీ, జో.. అచ్యుతానంద జోజో ముకుంద, చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ వంటి అనేక రచనలు బాలల కోసం అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సహాయ సంపాదకులుగా వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అనువాదం చేశారు.