NTV Telugu Site icon

KCR CLOUD BURST : గోదావరి వరదల వెనుక క్లౌడ్‌ బరస్ట్‌

Cm Kcr

Cm Kcr

KCR CLOUD BURST Special Story.

తెలంగాణలో సంభవించిన గోదావరి వరదల వెనక విదేశీ కుట్ర కోణం ఉండొచ్చని సీఎం కేసీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ ద్వారా కొన్ని దేశాలు కృత్రిమ వరదలతో దేశంలో ప్రకృతి విపత్తులు సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు. గ‌తంలో లద్దాఖ్‌, లేహ్‌, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్ సంఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంపై మేఘవిస్ఫోటనాలకు పాల్పడుతున్నట్టు తమకు స‌మాచారం ఉంద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. భద్రాచలం వరద ప్రాంతాల సందర్శన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, సీఎం కేసీఆర్‌ చెబుతున్న ఈ క్లౌడ్ బరస్ట్ కథేమిటి? మేఘవిస్పోటనానికి కారణాలేమిటనేది ఆసక్తిరేపే అంశాలు. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో గంటకు 10 సెంటీ మీటర్లకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ విస్పోటనాలు ఒకే ప్రాంతంలో పలు మార్లు జరిగే అవకాశం కూడా ఉంది. అటు వంటి పరిస్థితులలో తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లుతాయి. 2013 నాటి ఉత్తరాఖండ్‌ ప్రకృతి విలయం దీనికి ఒక ఉదాహరణ. క్లౌడ్‌ బరస్ట్ భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అధిక తేమతో కూడిన రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు ఉన్నట్టుండి తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి. పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే అక్కడ మేఘ విస్పోటనాలు అధికం. అంతమాత్రాన కేవలం పర్వత ప్రాంతాల్లోనే అలా జరుగుతుందనటం సమంజసం కాదు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి సమతల ప్రాంతాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ సంభవించిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే,దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాధిన ఎక్కువ ఎత్తులో చిన్న చిన్న పర్వతాలు అనేకం ఉంటాయి. అలాంటిచోట క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలు అధికం.

కొండ ప్రాంతాల్లో నీరు ఒకేచోట నిలవవుండకుడా పల్లానికి జారిపోతుంది. అటువంటి చోట్ల క్లౌడ్ బరస్ట్ అయినా పెద్దగా నష్టం కలగకపోవచ్చు. అయితే, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక గంటలో పడే 10 సె.మీ వర్షంతో భారీ నష్టం జరగదు. కానీ పల్లానికి ప్రవహించే నీరు ఆ ప్రాంతంలోని నదులు, సరస్సులు పొంగి వరదలు ముంచెత్తుతాయి. వాటివల్ల పరిసర ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ‌సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిందనే వాదన కూడా ఉంది. వాతావరణ మార్పుల కారణంగా తక్కువ వైశాల్యంలో తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వల్ల క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. కాబట్టి వీటిని అంచనా వేయడం కష్టం. రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం. హిమాలయ శ్రేణుల్లో క్లౌడ్ బరస్ట్‌లు,ప్రకృతి విపత్తులు సహజంగానే అధికం. అయితే మేఘ విస్పోటనం గావించి కృత్రిమంగా వర్షం కురిపించే శక్తి చైనాకు వుంది. ఇటీవల ఇండో-చైనా సరిహద్దు సంక్షోభం తీవ్రమైంది. ఈ ప్రాంత ప్రజలను ఖాళీ చేయించేందుకు చైనా దీనిని ఒక సాధనంగా ఉపయోగించుకుంటుందనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి.

లద్దాఖ్ నుండి అరుణాంచల్ ప్రదేశ్ వరకు చైనాతో భారత్‌ సరిహద్దు పంచుకుంటుంది. క్లౌడ్‌ బరస్ట్‌ వల్ల ఈ ప్రాంతంలో అప్పుడపుడు విపత్తులు ఏర్పడుతాయి. కానీ, ఎన్నడూ లేని విధంగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలోనే ఇవి ఎక్కువగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. మేఘ విధ్వంసం వెనుక చైనా హస్తం ఉందనే వాదనలకు బలాన్నిస్తోంది. సరిహద్దు పర్వత శ్రేణులలో కృత్రిమ వర్షం కురపించి ..ఆ ప్రాంత ప్రజలు వలసపోయేలా చేసి..తద్వారా భారత భూభాగంలోకి సులభంగా చొచ్చుకురావాలన్నదే చైనా ప్లాన్‌. 2008 బీజింగ్ ఒలింపిక్స్ కు ముందు చైనా భారీ ఎత్తున కృత్రిమ వర్షం సృష్టించి స్టేడియంలలో వాటర్‌ లీకేజీని పరీక్షించింది. చైనా క్లౌడ్‌ బరస్ట్ చేయగలదనటానికి ఇది ఒక ఉదాహరణ. చైనా మాత్రమే కాదు అమెరికా కూడా కృత్రిమ వరదలు సృష్టించ గలదు. 1948లో, ఇద్దరు భూ భౌతికశాస్త్రవేత్తలు ఘనీభవన పద్ధతులపై పరిశోధన చేస్తుండగా.. సిల్వర్ అయోడైడ్ బుల్లెట్లు భారీ వర్షాలకు కారణమయ్యే నీటి కణాల ఘనీభవనానికి కారణమవుతాయని కనుగొన్నారు. దీనికి క్లౌడ్ సీడింగ్ అని పేరు పెట్టారు. వియత్నాం యుద్ధంలో వాతావరణ మార్పుల కోసం అమెరికా ఆర్మీ ఈ పద్దతిని ఉపయోగించింది. వరదలతో శత్రు సేనలకు క్లిష్ట పరిస్థితులను సృష్టించటమే దీని ఉద్దేశం.

1970- 2016 మధ్య జమ్ము కశ్మీర్‌, లేహ్, ఉత్తరాఖండ్‌లోని పెహల్గామ్ నుంచి అరుణాంచల్ ప్రదేశ్ వరకు 30 క్లౌడ్‌ బరస్టులు సంభవించాయి. వీటి వల్ల 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, ఒక్క కేదార్‌నాథ్ వరదల్లోనే దాదాపు 6600 మరణాలు సంభవించాయి. భారతీయ ప్రధాన నీటి వనరులైన గంగా, యమునా, సరయూ, రామగంగపై కూడా డ్రాగన్‌ కన్నేసింది. ఈ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చిన తర్వాత నదుల ప్రవాహాన్ని సొరంగాల ద్వారా మళ్లించాలన్నది కూడా దాని ప్లాన్‌లో భాగం. భూ దాహం ఎక్కువగా ఉన్న డ్రాగన్ దేశం ఎంతకైనా తెగిస్తుంది. తెలుసు కాబట్టి వరదల వెనక చైనా హస్తం ఉందనటాన్ని నమ్మాల్సి వస్తుంది. సియాచిన్, అరుణాచల్‌, లడఖ్‌ లో దాని కుట్రలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్‌బరస్ట్ సమస్యను అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐతే, సీఎం కేసీఆర్‌ క్లౌడ్‌ బరస్ట్ గురించి ప్రస్తావించటంతో తాజాగా దీని మీద చర్చ మొదలైంది.