రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ జర్నలిస్టులు, ఆదివాసీలపై దాడులు చేయిస్తూ స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎల్ నినో వస్తుందని పది నెలల ముందే సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు” ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిన్నటి సీఎం ప్రెస్ మీట్లో ఆయన నిస్సహాయత స్పష్టంగా కనిపించిందని, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ప్రజా సంక్షేమం కోసం ఆయన చెప్పిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రైతులను త్యాగాలు చేయమనడం కాదు.. మీ పదవులను త్యాగం చేస్తారా?
ఒక్క సీజన్ వరి పంట వేయవద్దని, రైతులు త్యాగం చేయాలని సీఎం చెప్పడంపై కవిత మండిపడ్డారు. రైతులను త్యాగం చేయమని అడుగుతున్న రేవంత్ రెడ్డి, ముందుగా తన కాంగ్రెస్ నాయకులను పదవులు త్యాగం చేయాలని అడగగలరా అని ప్రశ్నించారు. నీళ్లు కొనుగోలు చేసేవి కావని పదే పదే చెప్తున్న సీఎం, ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నీటిని ఎందుకు అందుబాటులోకి తేలేదని నిలదీశారు. కనీసం తన సొంత జిల్లాలోని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసుకోలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు మూడు నెలల ముందే కరువుపై స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఈ ప్రభుత్వం మాత్రం కాలం చెల్లిన తర్వాత సీతక్క నేతృత్వంలో కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథను పక్కన పెట్టారు.. చెరువులను మాయం చేశారు
కేసీఆర్ హయాంలో ఇంటింటికీ తాగునీరందించిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కనీసం నిర్వహణ (మేంటెనెన్స్) చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని, వెంటనే దానిని వినియోగంలోకి తెచ్చి నగరాల్లో, గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించాలని కవిత డిమాండ్ చేశారు. మేడిగడ్డపై నివేదిక వచ్చిందని, దానిని కూల్చివేసి కడతారా లేదా ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ నగరంలో వాటర్ కష్టాలకు ముఖ్యమంత్రి అనుచరులే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిటీలో 8 వేల చెరువులు మాయమయ్యాయని కాగ్ రిపోర్టు వచ్చిందని, ఈ విషయంలో హైడ్రా ఏం చేస్తోందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరువులో ఉన్న రైతులు, కూలీలకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. 12 వేల ఆర్థిక సాయం అందించడంతో పాటు పంటలకు ఇన్స్యూరెన్స్ కల్పించాలని కోరారు.
ప్రైవేటీకరణ కుట్రలు.. కేటీఆర్ సభలపై కవిత ఘాటు వ్యాఖ్యలు
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, యాదాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని విభాగాలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో చెప్పాలని కవిత నిలదీశారు. అలాగే పార్టీ అంతర్గత విషయాలు, కేటీఆర్ వైఖరిపై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు, పార్టీకి ప్రతిమా శ్రీనివాస్ ఎన్నో విధాలుగా తోడుగా ఉన్నారని, అలాంటి వ్యక్తిపైనే కేటీఆర్ లేఖ రాయడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నమ్ముకున్న వాళ్లను కేటీఆర్ ముంచుతాడని తనకు తెలుసని, విచారణ చేయాలని కేటీఆర్ లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిమా శ్రీనివాస్ను కాపాడే ప్రయత్నం చేశారన్నారు. ఇక సింగరేణి సభలో కేటీఆర్ కార్మికుల సమస్యల కంటే రాజకీయాలే ఎక్కువ మాట్లాడారని, ఆయనకు కార్మికుల కష్టాలు తెలియవని వ్యాఖ్యానించారు. అది సింగరేణి కార్మికుల కోసం పెట్టిన సభ కాదని, కేవలం బలప్రదర్శన , ‘షో ఆఫ్’ కోసం కేటీఆర్ పెట్టుకున్న సొంత సభ అని కవిత ఆరోపించారు.

