తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ వేడుకలు బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో పాటలు పాడిస్తూ బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా బతుకమ్మ విశిష్టత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పండుగ ద్వారా మహిళలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతలా కృషి చేశామో వివరించారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.
రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
మహిళలు, బహుజనుల కోసం పాటు పడుతున్న తనను ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ సంబురాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా.. రిజర్వేషన్లు అమలు చేసినా, చేయకున్నా తమ పార్టీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 50 శాతం సీట్లను మహిళలకు ఇస్తుందని ప్రకటించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రపంచంలో ఎవరికీ లేని అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగ మన తెలంగాణ సొంతమని అన్నారు. ప్రపంచానికి చాటేలా ఈ పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలు నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. గౌరమ్మ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

