Site icon NTV Telugu

Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని కూతురుని చంపిన పేరెంట్స్..

Honour Killing

Honour Killing

Honour Killing: తెలంగాణలో మరో పరువు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలోని ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన యువకుడితో ప్రేమ వ్యవహారం.. కుటుంబానికి తెలియడంతో ఈ ఘాతుకం జరిగినట్టుగా పోటీసులు చెబుతున్నారు.. గ్రామానికే చెందిన, ఇప్పటికే వివాహం చేసుకున్న ఒక యువకుడితో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ప్రేమాయణం సాగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ యువకుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత, వారు మొదట కూతురిని తీవ్రంగా మందలించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, తల్లిదండ్రులు ఘాతుకానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.

Read Also: Pragati: ‘అలాంటి వాళ్లు భూమికి భారం… పెట్రోల్ పోసి కాల్చిపడేస్తా’

గత నెల నవంబర్ 14, 2025న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కూతురిని బలవంతంగా పురుగుల మందు తాగించి, అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య అనంతరం, తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తల్లిదండ్రులే పోలీసుల వద్దకు వెళ్లి, కడుపునొప్పితో బాధపడుతూ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు.. అయితే, బాధిత యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, గ్రామస్థుల సమాచారాన్ని సేకరించిన అనంతరం, తల్లిదండ్రులే తమ కూతురిని హత్య చేశారని పోలీసులు తేల్చారు.

కేసు విచారణలో నేరం నిర్ధారణ కావడంతో, పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో మధ్యవర్తుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, యువకుడి ప్రమేయం వంటి అంశాలపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు. ఒక వైపు ప్రేమ వ్యవహారం, మరో వైపు పరువు పేరుతో తీసుకున్న ప్రాణం కారణంగా శివరామ్‌పల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన మరోసారి సమాజంలో పరువు హత్యల నిర్మూలన, యువతలో అవగాహన, కుటుంబ కౌన్సెలింగ్ అవసరంపై చర్చకు తెరలేపింది.

Exit mobile version