NTV Telugu Site icon

పిల్లులు కావాలో.. పులి బిడ్డ కావాలో ప్రజలు తేల్చుకోవాలి: కిషన్ రెడ్డి

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో శనివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకరమైనదని అభివర్ణించారు. ఎవరు ఎమ్మెల్యే ఉండాలి అనేది కాదు… ఈ రాష్ట్రం ఎటు పోవాలి అనే దాని కోసం ఈ ఎన్నిక జరుగుతోందన్నారు. ఇంతమంది జనం చూసిన తర్వాత ఇంకా ఎన్నిక నిర్వహించడం అవసరమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ జనం చూసి కేసీఆర్ తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. తాను నిజాం రాజును.. ప్రజలు తనకు బానిసలు అని కేసీఆర్ భావిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. నీతి నిజాయితీ ఉన్నవారు అయన పక్కన ఉండవద్దని సూచించారు.

Read Also: టాప్‌ గేర్‌లో హుజురాబాద్‌ ప్రచారం!

తాను ఎవరికీ తలవంచను అని ఈటల అంటే.. అవమానించి బయటకు పంపించారని విమర్శించారు. ఇది ఈటల రాజేందర్‌కు జరిగిన అవమానం కాదని.. హుజూరాబాద్ ప్రజలకు జరిగిన అవమానమని, తెలంగాణ ఉద్యమ కారులకు జరిగిన అవమానమని కిషన్ రెడ్డి అన్నారు. వెన్నెముక లేనివారు కావాలా?. ధైర్యవంతుడు కావాలా ? పిల్లులు కావాలా ? పులి బిడ్డ కావాలా ? ఆత్మాభిమానం ఉన్నవారు కావాలా? ఆత్మను ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టే వారు కావాలా అన్న విషయం హుజురాబాద్ ప్రజలు తేల్చుకోవాలన్నారు.

హుజురాబాద్‌లో బీజేపీ గెలిచిన్నంత మాత్రాన సంక్షేమ పథకాలు ఆగిపోవన్నారు. ఈటల రాజేందర్ వల్ల దళిత బంధు వచ్చింది తప్ప దళితుల మీద ప్రేమతో కాదని ప్రజలు గుర్తించాలన్నారు. అందుకే ఈ పథకానికి ‘ఈటల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు’ అని పేరు పెట్టాలన్నారు. కేసీఆర్‌కు దళితుల మీద ప్రేమ ఉంటే 31 వ తేదీలోగా తెలంగాణలో ఉన్న దళితులందరికీ  దళిత బంధు ఇవ్వాలన్నారు. కేసీఆర్ డబ్బులనే నమ్ముకున్నారని.. ప్రజలను కాదని ఎద్దేవా చేశారు. ఓటర్లను కొంటాను.. గెలుస్తాం.. ఫామ్ హౌస్‌లో పడుకుంటా అని కేసీఆర్ అనుకుంటున్నాడని.. టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన నాయకులందరికీ ఈ ఎన్నిక తమ రాజకీయ జీవితంలో మాయని మచ్చ అవుతుందన్నారు. నియంత ప్రభుత్వాన్ని తిప్పి పంపడానికి తెలంగాణ ప్రజలకు హుజూరాబాద్ ప్రజలు మార్గదర్శకంగా ఉండాలన్నారు. తెలంగాణలో ఫామ్ హౌస్ పాలన పోవాలి, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. అసెంబ్లీలో ఈటల రాజేందర్ ప్రజల గొంతుక అవుతారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.