‘జాగృతి జనం బాట’లో భాగంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను తొలగించడంపై స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడానికి కవిత తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నా అని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నా అని, చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నల్లగొండకు కల్వకుంట్ల కవిత రానున్న నేపథ్యంలో ఆమె అభిమానులు కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన కటౌట్‌లు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ… ‘తెలంగాణ వచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలం అయ్యాయి. ప్రభుత్వాలను అడిగేందుకు, నిలదీసేందుకే జాగృతి జనం బాట. సుంకిశాల లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరగాలి. నాగార్జున సాగర్ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలి. కృష్ణా జలాలను నల్లగొండకు తీసుకురాకపోతే.. భూ నిర్వసితులతో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం’ అని అన్నారు.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
‘బీఆర్ఎస్‌ను తిట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్ అదే నిర్లక్ష్యం చేస్తుంది. సీఎం ఆదేశాలను కలెక్టర్‌లు పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎపిడ్యూరల్ మెడిసీన్ అందివ్వకపోవడం బాధ అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిడ్యూరల్ మెడిసీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలి. కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారో సీఎం చెప్పాలి’ అని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
