Site icon NTV Telugu

KA Paul: ఒక్క లేఖ రాస్తే చాలు.. సీఎం కేసీఆర్‌కు లక్ష కోట్లు ఇస్తా

Ka Paul Offer Cm Kcr

Ka Paul Offer Cm Kcr

KA Paul Offer To CM KCR If He Writes A Letter On Peace Meeting: అక్టోబర్ 2వ తేదీన శాంతి సదస్సు నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే.. తాను తెలంగాణ రాష్ట్రానికి రూ. లక్ష కోట్లు ఇస్తానని బంపరాఫర్ ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. యాదగిరిగుట్టకు రూ.2వేల కోట్లు ఇచ్చిన సీఎం.. క్రైస్తవుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి చూపుతున్నారని, ఇంతవరకూ ఏ చర్చికి రూ.2 వేలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అన్ని మతాలను సీఎం కేసీఆర్ సమానంగా చూడడం లేదని విమర్శించారు. తాను సీఎం అయితే మాత్రం అన్ని మతాలను సమానంగా చూసుకుంటానని.. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు నిధులిస్తానని చెప్పారు. క్రైస్తవుల్లో ఐకమత్యం కొరవడిందని, ఇంటికో పార్టీ పెట్టుకొని కూడా ఇతర పార్టీ నాయకుల దగ్గర దేహీ అంటూ వెళ్తున్నారని ఆరోపణలు చేశారు.

ఇదే సమయంలో తన పార్టీ రద్దు అయ్యిందని వస్తున్న వార్తలపై కేఏ పాల్ స్పందిస్తూ.. తమ పార్టీ రద్దు కాలేదని, తమ పార్టీకి ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని, దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని అన్నారు. ఈనెల 25న తన 59వ పుట్టినరోజు సందర్భంగా.. మునుగోడులో 59 మందికి డ్రా ద్వారా పాస్‌పోర్టులు ఇప్పిస్తానని, విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. మరో ఏడు వేల మందికి సైతం ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు బయట కొట్టుకుంటున్నా.. లోపల మాత్రం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. లోపల కుమ్మక్కై, బయట మాత్రం రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వేల పాటలు పాడిన గద్దర్ శాంతి కోసం పాటు పడ్డారని, ఆయన భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Exit mobile version