NTV Telugu Site icon

Jubileehills Road Accident: ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ ఏమన్నారంటే..?

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదంలో మహిళ పడేయడంతోనే చిన్నారి చనిపోయిందంటున్నారు ఎమ్మెల్యే షకీల్‌. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్‌ ఈ విధంగా స్పందించారు. ప్రమాదం జరిగిన తర్వాతే ఆ మహిళే పాపను కింద పడేసిందని, ఆమె పడేయడంతోనే చిన్నారి చనిపోయిందని షకీల్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకోవాలని మీర్జా ఫ్యామిలీకి చెప్పానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘గురువారం యాక్సిడెంట్‌ జరిగిన కారు నా కజిన్‌ది. ఆ కారు నేను కూడా అప్పుడప్పుడు వాడతాను. అందుకే ఆ కారుకు నా స్టిక్కర్‌ అంటించారు. ప్రమాదం ఘటన తెలియగానే నా కజిన్‌ మీర్జాతో మాట్లాడాను. కారు నడిపింది నా కజిన్‌ మీర్జా కొడుకు’’ అని షకీల్‌ తెలిపారు.

జూబ్లీహిల్స్‌లో నిన్న ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరిట స్టిక్కర్‌ ఉంది. రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1 వైపు మహీంద్రా థార్ కారు వెళుతోంది. తిరిగి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొంది. రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి. కారును నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన మహిళలతోపాటు చిన్నారి మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. వీరంతా భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ మహిళలను మహారాష్ట్రకు చెందిన కాజల్‌చౌహాన్‌, సారికచౌహాన్‌, సుష్మ భోంస్లేగా, మృతిచెందిన చిన్నారిని రణవీర్‌ చౌహాన్‌గా గుర్తించారు. ఈ ఘటన బాధాకరం అన్నారు ఎమ్మెల్యే షకీల్. గాయపడ్డ మహిళ కాజల్‌ చౌహాన్ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంపై విమర్శలు వస్తున్న వేళ ఎమ్మెల్యే షకీల్ స్పందించి వివరణ ఇచ్చారు.