JP Nadda Fires On Bandi Sanjay Arrest: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తోన్న ఆదరణ చూసి సీఎం కేసీఆర్ ఆందోళనకు గురవుతున్నారని, అందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయించారని ఆరోపణలు చేశారు. ‘‘బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీకి వస్తోన్న మద్దతు చూసి కేసీఆర్‌కు గుబులు పట్టుకుంది. అందుకే, బండి సంజయ్‌ని అరెస్ట్ చేయించారు. మేము ప్రజాస్వామ్యయుతంగానే పోరాడి.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌కు చరమగీతం పాడుతాం’’ అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆమె ఇంటి ముందు నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని నిరసిస్తూ.. జనగామ జిల్లాలోని పామ్నూరులో పాదయాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ దీక్షను చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేసి, బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి, వాహనంలోకి ఎక్కించుకొని ఆయన నివాసానికి తరలించారు. ఈ వ్యవహారం మీద బీజేపీ నేతల నుంచి సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. శాంతియుతంగా చేసుకుంటోన్న పాదయాత్రను అడ్డుకున్నారని.. పోలీసులు దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించరాదని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ వచ్చాక తెలంగాణ పోలీసుల్ని భ్రష్టు పట్టించారని ఘాటు విమర్శలు గుప్పించారు.
