రాజకీయ నాయకులు ఈ మధ్యకాలంలో ఏడాదికో పార్టీ మారుతున్నారు. అయితే తామేం పార్టీలో ఉన్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో వారికి గుర్తుకురావడం లేదు. ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీకి జై కొట్టడం అలవాటులో పొరపాటుగా జరిగిపోతుంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అదే జరిగింది. ఎమ్మెల్యే రమణ రెడ్డి అనుచరులు ఇంకా బీఆర్ ఎస్ పార్టీని ఒంట ఓట్టించుకోలేదు. ఇప్పటికీ ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయన అనుచరాలు జై కాంగ్రెస్ అని అంటూనే ఉన్నారు. వారి నినాదాలు విని పార్టీ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతూనే వుంది.
Read Also: CM KCR : కైకాల విలక్షణ నటుడు.. కొంతకాలం మేము కలసి పని చేశాం
తాజాగా ఉపాధి హామీ పనులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభను ఉత్తేజపరిచేందుకుగాను నినాదాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా గులాబీ బట్టలేసుకున్నారు. జై బీఆర్ఎస్ కు బదులుగా జై కాంగ్రెస్ అని పలకడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
జై బీఆర్ఎస్ అని అనడానికి బదులు రేగొండ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పెట్టేం శంకర్ జై కాంగ్రెస్ అంటూ నినదించారు. అక్కడ ఉన్న మిగతా నేతలు జరిగిన పొరపాటును అతని దృష్టికి తేవడంతో నాలిక్కరుచుకుని మళ్లీ జై బీఆర్ఎస్, బీజేపీ నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. జై బీఆర్ఎస్ పార్టీ అనడానికి బదులుగా జై కాంగ్రెస్ అని అనడంతో రమణారెడ్డి అనుచరులకు పాత వాసనలు పోలేదని జనం చెవులు కొరుక్కున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.