Site icon NTV Telugu

Telangana Rains : జగిత్యాలలో వరద బీభత్సం.. స్థంభంపల్లి పెద్ద చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం

Rains

Rains

Telangana Rains : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జగిత్యాల జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లి గ్రామాలపై విరుచుకుపడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు దెబ్బతినగా, చిన్న చిన్న కాలువలు కూడా నదుల్లా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొత్తం జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రత్యేకంగా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం (ఆగస్టు 27) రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి మట్టం వేగంగా పెరగడంతో మత్తడి దూకే స్థాయికి చేరుకుంది.

జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్.. రోజుకు కేవలం రూ.5లతో అన్‌లిమిటెడ్ కాల్స్!

అయితే చెరువు తూము వద్ద ఉన్న కట్ట ఇప్పటికే బలహీనంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బండరాళ్లతో తెట్టె కట్టినప్పటికీ, మరోసారి భారీ వర్షం కురిస్తే నీరు ఆ తెట్టెను దాటుకుని చెరువులో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. తూము పక్కన బలహీనంగా ఉన్న భాగం గుంతలోకి మరింత నీరు చేరితే కట్టకు గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెరువుకు గండి పడితే వెల్గటూర్, కోటిలింగాల, పాశీగాం వంటి గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తక్షణమే అధికారులు చెరువు వద్దకు చేరుకుని కట్టను పర్యవేక్షించి, అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, ఉన్నత స్థాయి అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్.. వరదల్లోనూ రయ్ రయ్..

Exit mobile version