Jagga Reddy Gives His Opinion On AICC President: ఏఐసీసీ అధ్యక్షులుగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి ఇస్తే హ్యాపీ అన్నారు. కానీ, వేరే వాళ్లకు ఇస్తేనే ఇబ్బందిగా ఉంటుందని బాంబ్ పేల్చారు. ఒకవేళ అశోక్ గేహ్లాట్, శశి థరూర్‌లలో ఎవరో ఒకరికి అధ్యక్ష బాధ్యలు అప్పగించినా.. నిర్ణయాధికారం సోనియాకు ఉండాలని కోరారు. ఇదే సమయంలో గిరిజన బంధు పథకం గురించి మాట్లాడుతూ.. గిరిజన బంధు ఇస్తే మంచిదే కానీ, అన్ని కులాలకు బంధు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకటన అమలు చేయకపోతే.. ఎన్నికల ముందు చేసే స్టంట్ అవుతుందని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగానే.. గతంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, ఆ హామీని ఇంకా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఎస్టీ రిజర్వేషన్ విషయంలో అది రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. ఇక నూతన సచివాలయానికి తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాల్సిందిగా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎల్పీ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. మరి.. పార్లమెంట్‌కి అంబేద్కర్ పేరు పెట్టి అయన రుణం తీర్చుకుంటారో లేక ఖూనీ చేస్తారో చూడాలని జగ్గారెడ్డి వెల్లడించారు.
మరోవైపు.. ఏఐషీసీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అధ్యక్ష పదవికి ఎల్లుండి నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఈనెల 24వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఓవైపు రాహుల్ గాందీనే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానం చేస్తుండగా, జీ23 మాత్రం గాంధీయేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్, శశిథరూర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
