Site icon NTV Telugu

Indrakiran Reddy: ఆ మార్పు.. ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యం

Indrakiran Reddy

Indrakiran Reddy

Indrakiran Reddy Gives Warning To Tamilisai: దేశంలో ఇప్పుడు గుణాత్మక మార్పు అవసరమని, అది ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన నాయకత్వం అవసరం ఉందని చెప్పారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి, అభివృద్ధిలో తీసుకెళ్తోన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. అన్ని విషయాలపై పట్టున్న కెసిఆర్‌లాంటి సమర్థ నాయకుడి వల్లే సాధ్యమవుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారన్నారు. బీజీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఎండగడుతూ.. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను, ముఖ్య నేతలను ఏకం చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.

ఇదే సమయంలో.. గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యల్ని ఇంద్రకిరణ్ రెడ్డి ఖండించారు. తమిళిసై ఒక రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్ భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చారని ధ్వజమెత్తారు. తమిళిసై తన పద్ధతి మార్చుకోకపోతే.. గతంలో ఎన్టీఆర్ హయాంలో గవర్నర్‌గా పనిచేసిన రాంలాల్‌కు పట్టిన గతే ఆమెకు పడుతుందని హెచ్చరించారు. అప్పట్లో రామ్‌లాల్ ఇలాగే రాజకీయాలు చేసి, ప్రజాగ్రహానికి గురయ్యారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్దిని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తుంటే.. గవర్నర్‌కు మాత్రం ఇవేమీ కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తన పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం సహించేదే లేదని ఇంద్రకిరణ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version