హైదరాబాద్ నగరంలో పేదలు, అడ్డా కూలీలు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, ఆటో డ్రైవర్లకు భరోసా కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం, సంక్షేమం పట్ల కట్టుబాటుతో ప్రభుత్వం “ఇందిరమ్మ క్యాంటీన్‌లు” సంఖ్యను పెంచుతూ, కొత్త కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్ ప్రాంతాల్లో ఏర్పాటైన కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, పంకజ, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి, మేయర్, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయంగా లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించగా, అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, పేదలతో కలసి భోజనం చేశారు. వారి సమస్యలు, అవసరాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ క్యాంటీన్‌లలో లబ్ధిదారులకు సబ్సిడీతో రూ.5కే అల్పాహారం, రూ.5కే భోజనం అందించబడుతుంది. ఒక్కో అల్పాహారంపై జీహెచ్ఎంసీ రూ.14, భోజనంపై రూ.24.83 సబ్సిడీ ఖర్చు చేయనుంది. దీంతో ఒక లబ్ధిదారునికి నెలకు సగటున రూ.3 వేల వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఈ క్యాంటీన్‌ల నిర్వహణ బాధ్యతను “హరే కృష్ణ హరే రామ ఫౌండేషన్” చూసుకోనుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఈ కేంద్రాలు పేదలకు మాత్రమే కాకుండా, అల్పాదాయ వర్గాల జీవన విధానానికి పెద్ద తోడ్పాటును అందించనున్నాయి.
ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “గరీబి హటావో” అనే నినాదంతో ఇందిరమ్మ పేదల సంక్షేమానికి జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
“హైదరాబాద్ నగరంలోనే ఇప్పటివరకు 60 వేల రేషన్ కార్డులు కొత్తగా పంపిణీ చేశాం. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్‌లను విస్తరిస్తున్నాం. ఇకపై కేవలం రూ.5కే అల్పాహారం కూడా అందించబడుతుంది” అని మంత్రి స్పష్టం చేశారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ, “ఇందిరమ్మ క్యాంటీన్‌లు పేదలకు, అల్పాదాయ వర్గాలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌లో 150 కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభించబోతున్నాం” అని ప్రకటించారు. అంతేకాకుండా మహిళా సాధికారత దిశగా, ఈ క్యాంటీన్‌ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు (SHGs) కేటాయించనున్నట్లు వెల్లడించారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “మింట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ అందరికీ చేరువలో ఉంది. పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇది పెద్ద మేలు చేస్తుంది” అని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, “ఇందిరమ్మ క్యాంటీన్‌ల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తే ఇంకా సమర్థంగా పనిచేస్తాయి” అని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆహారం ఖర్చులు గణనీయంగా పెరుగుతున్న సమయంలో, రోజుకు రెండు పూటలు కేవలం రూ.10కే తినే అవకాశం కల్పించడం పేదలకు నిజంగా వరం. ముఖ్యంగా అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, వలస కూలీలు ఈ క్యాంటీన్‌ల ద్వారా నేరుగా లాభపడుతున్నారు.
