NTV Telugu Site icon

Floating Solar Plant: ఎన్టీపీసీ రికార్డ్.. దేశంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం

Ntpc Ramagundam

Ntpc Ramagundam

ఎన్టీపీసీ మరో రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్దదైన తేలియాడే సోలార్ ప్లాంట్ ను నిర్మించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పివీ ప్రాజెక్ట్ లో భాగంగా చివరిదైన 20 మెగావాట్లను ఉత్పత్తి ప్రారంభం అయింది. దీంతో మొత్తం 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిచేస్తోంది.  ఈ ఘనత సాధించినందుకు రామగుండం టీమ్ ను  ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(సౌత్) అభినందించారు. పునరుత్పత్తి ఇంధన సామర్థంలో ఎన్టీపీసీ తన నిబద్ధతను చాటుకుందని ఆయన అన్నారు.

రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభించడంతో దక్షిణ భారతదేశంలో ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగింది. రామగుండం కన్నా ముందు కేరళలోని కాయంకుళం వద్ద 92 మెగావాట్లు, ఏపీలో సింహాద్రిలో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టులను ఎన్టీపీసీ ప్రారంభించింది.

రూ. 423 కోట్ల వ్యయంతో 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న రిజర్వాయర్ లో ఈ ప్లాంట్ ను నిర్మించారు. 40 బ్లాకులుగా విభజించిన ఫ్లాంట్ లో ఒక్కో బ్లాక్ 2.5 మెగావాట్ విద్యుత్ ను జనరేట్ చేస్తుంది. ప్రతీ బ్లాక్ ఫ్లోటింగ్ ప్లాట్ ఫారమ్ లో 11,200 సోలార్ మాడ్యుల్స్ ఉంటాయి. దీంతో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, ఒక హెచ్ టీ బ్రేకర్ ఉంటుంది. సోలార్ మాడ్యుల్స్, హైడెన్సిటీ పాలిథిలిన్(హెచ్ డీ పీ ఈ)తో తయారు చేసిన తేలియాడే ఫ్లోటర్ పై ఉంచుతారు. ఇవి కదలకుండా లంగరు వేసి ఉంచుతారు. అండర్ గ్రౌండ్ 33 కేవీ కేబుల్స్ ద్వారా స్విచ్ యార్డ్ కు విద్యుత్ తరలిస్తారు. సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్స్, ట్రాన్స్‌ఫార్మర్లు మొత్తం ఫ్లోటింగ్ ఫ్లాట్ ఫారమ్ మీద ఉంచడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత

ఇటు విద్యుత్ ఉత్పత్తితో పాటు, పర్యావరణం, నీటి వనరులకు సహయపడనుంది ఈ సోలార్ పవర్ ప్లాంట్. నీటిపై ఏర్పాటు చేయడం వల్ల నీటి భాష్పీభవన రేటు తగ్గుతుంది. దీంతే ఏడాది కాలంలో 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించి నీటి  సంరక్షణకు తోడ్పతుంది. ఇదే విధంగా ఏడాదికి 1,65,000 టన్నుల బొగ్గు వినియోగాన్ని తగ్గించడంతో పాటు 2,10,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నివారించే వీలుంది.

 

 

Show comments