NTV Telugu Site icon

Driverless Car: ఐఐటీ హైదరాబాద్ మరో ఆవిష్కరణ.. ఇండియాలోనే తొలి డ్రైవర్ లెస్ కారు టెస్ట్ రన్

Driverless Car

Driverless Car

డ్రైవర్‌ లేకుండానే వాహనాలు నడిపే విషయంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ ముందడుగు వేసింది. ఇండియాలోనే మొదటిసారిగా డ్రైవర్ లేకుండా నడిచే కారు టెస్ట్ రన్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహించింది. ఇందుకోసం మలుపులు, స్పీడ్‌బ్రేకర్లు లేకుండా 2 కిలోమీటర్లు పొడవైన ట్రాక్ నిర్మించింది. కేంద్రమంత్రి జితేంద్రసింగ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించారు. డ్రైవర్‌ లేకుండా 2 కిలోమీటర్ల పాటు ఈ కారును నడిపించి పరీక్షించారు. ఇటువంటి ప్రయోగం దేశంలోనే మొదటిది.

ఆగస్టు నుంచి విద్యార్థులను తరలించేందుకు క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ వాహనాలను నడుపుతామని అటానమస్ నావిగేషన్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే తొలుత భారీ పేలోడ్ వస్తువులను డెలివరీ చేసేందుకు డ్రైవర్ లెస్ వాహనాలను నడపాలని యోచిస్తున్నామని వివరించారు. మరోవైపు మెట్రో స్టేషన్, ఇతర రవాణా వ్యవస్థల నుంచి వెళ్లేందుకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన సైంటిస్టులు ఇటీవల సైకిల్‌ను కూడా డెవలప్ చేశారు. ఈ సైకిల్ మనం తొక్కకుండానే నడుస్తుంది. ఎవరైనా మొబైల్ అప్లికేషన్‌లో సైకిల్‌ను బుక్ చేసినప్పుడల్లా, అది జీపీఎస్ లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ స్వయంగా ప్రయాణికుడి దగ్గరకు వెళ్లి ఎక్కించుకుంటుంది. దీనికి సంబంధించిన టెస్ట్ రన్ కూడా ఇటీవల ఐఐటీ హైదరాబాద్‌లోనే జరిగింది.