Tragedy: హైదరాబాద్ మహానగరంలోని ఐటీ కారిడార్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఆదివారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం తల్లాచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య బత్తుల భారతి (60), వీరి కుమారుడు బత్తుల నిషాంత్ రెడ్డి (38) గత ఏడాది కాలంగా గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్మెంట్స్, సి-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702లో నివాసం ఉంటున్నారు. కుమారుడు నిషాంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 8:40 గంటల ప్రాంతంలో ఈ ఫ్లాట్‌లో ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె. సైదులు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలే కారణమా?
కుటుంబ సభ్యులందరూ ప్రాణాలు తీసుకోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, వీరు గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి స్వగ్రామంలోను, అపార్ట్మెంట్ వాసుల్లోను తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

