NTV Telugu Site icon

TGPSC Group-3: నేటి నుంచి గ్రూప్‌–3 పరీక్షలు.. అరగంట ముందే గేట్లు క్లోజ్‌

Tgpsc Group 3

Tgpsc Group 3

TGPSC Group-3: రాష్ట్రంలో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రోజు రెండు పరీక్షలు, రెండో రోజు ఒక పరీక్షలు నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. రేపు (18న) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్-3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.

Read also: Rajanna Sircilla: జాతరలో కుక్క స్వైరవిహారం.. 21 మందిపై దాడి..

రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేసి నేరుగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. గ్రూప్-3 అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే సెంటర్ల గేట్లను మూసివేస్తామని.. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లు , ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచుకోవాలని TGPSC సూచించింది. డూప్లికేట్ హాల్ టిక్కెట్లు జారీ చేయబడవు.

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్..

గ్రూప్-3 పరీక్షల నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఈ నెల 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ కమిషనర్లు అవినాష్ మహంతి, సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిషేధిత ప్రాంతాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు నిషేధించామని, పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, ఫోటో స్టూడియోలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆంక్షలు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు అమల్లో ఉంటాయి.

పరీక్షలకు ప్రత్యేక బస్సులు

గ్రూప్-3 పరీక్షల దృష్ట్యా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా 102 పరీక్షా కేంద్రాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని వివరించారు. కోఠి, రేతిఫైల్లో కమ్యూనికేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే బస్సుల సమాచారం కోసం ఫోన్ నెం. 99592 26160, 99592 26154 సంప్రదించవచ్చు. నేడు, రేపు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
Musi River: మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర.. ఇవాళ, రేపు బస అక్కడే..