Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..

Heavy Rain Alert

Heavy Rain Alert

Heavy Rain Alert: ఉత్తర ఒడిశా భూ ఉపరితలంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. తీరం దాటిన తర్వాత ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఐఎండీ అంచనాల ప్రకారం, ఈరోజు అల్లూరి సీతారామరాజు (ASR), పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో బులెటిన్ జారీ చేసింది.

తెలంగాణలోనూ ఈ వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. పెద్దాపురంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఏలూరు, పాలకోడేరు, కొమరాడ, భీమడోలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో సుమారు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు.. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.