Industrial Tragedy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పేలుడు ధాటికి పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఈ సందర్భంగా మార్చరీలో ఉన్న మృతదేహాలకు వారి కుటుంబ సభ్యుల డీఎన్ఏతో మ్యాచ్ చేసి అప్పగిస్తున్నారు. అయితే, ఈ రోజు మరో 13 మృతదేహాలను అధికారులు గుర్తించారు. దీంతో మృతదేహాల గుర్తింపు సంఖ్య ఇప్పటి వరకు 31కి చేరింది. ఇక, తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు ఇచ్చి.. ఈ రాత్రికే మృతుల స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మార్చురీలో 7 మృతదేహాలు ఉండగా.. గుర్తు పట్టలేని స్థితిలో మరికొన్ని అవయవాలు, మాంసపు ముద్దలు దర్శనమిస్తున్నాయి.
Read Also: UP News: ఆహారంలో ఉప్పు ఎక్కువైందని గర్భిణీ భార్యపై భర్త దాడి.. మృతి..
మరోవైపు, సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో కంపెనీ యాజమాన్యం ప్రెస్ నోట్ విడుదల చేసింది. నిన్న 40 మంది మృతి చెందారని ప్రకటన ఇచ్చి.. ఇప్పుడు 38 మంది మృతి చెందారని మరో ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 33 మందిలో 12 మంది డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. డిశ్చార్జ్ అయిన వారి వివరాలు మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు.
