KTR: తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. “పక్కా మాఫియా పాలన” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు.. నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్‌ల మీద జెలటిన్ స్టిక్స్‌తో బాంబులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ “ఇది మానవ నిర్మిత విధ్వంసం” అని మొత్తుకుంటున్నా, ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారు.. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా? ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, భూగర్భ జలాలు పెరగాలని మేం చెక్ డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని కేటీఆర్ అన్నారు. మీ ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా?అని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు లాటిది.. ఇప్పుడు మీ సమాధానం ఏంటి రేవంత్ రెడ్డి?.. అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు అన్నారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయట పెట్టండి.. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే.. లేదంటే ఈ బాంబుల సెగ మీ కుర్చీ దాకా రావడం ఖాయం అని కేటీఆర్ వెల్లడించారు.
