Site icon NTV Telugu

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Saddula Bathukamma

Saddula Bathukamma

Saddula Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.. ఇక, సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ.. అతిపెద్ద బతుకమ్మగా గిన్నీస్ రికార్డుల కెక్కింది. మరోవైపు, ఇవాళ జరగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. కాగా, దసరా ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించింది. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూ లయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది.

Read Also: Peddi : రామ్ చరణ్‌ కు బ్యాడ్ సెంటిమెంట్.. బ్రేక్ చేస్తాడా..?

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి పువ్వేసి సందమామా.., చిత్తూచిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గు మ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా.. అంటూ బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం మార్మోగింది.. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి.. ఒకే వేదికపై సుమారు పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశారు. మన బతుకమ్మ కార్నివాల్‌ పేరుతో ఈ వేడుక నిర్వహించారు..

ఇక, సిటీలో దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెన్‌రోడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్” వరకు అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న ఈ ఉత్సవాల కారణంగా .. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ..

Exit mobile version