కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి తీవ్రం అవుతుందని, తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్ళిపోతారు… మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అందుకే యువత ప్రాణాలకు తెగించి పోరాటం చేశారని, అలా తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో యువత రాష్ట్ర ప్రభుత్వం పై తిరగబడే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా మంత్రులు అపాయింట్మెంట్ తీసుకోకుండా ఢిల్లీకి వెళ్లి మంత్రులు కలవడం లేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఎదో పని మీద ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని కేంద్రాన్ని బద్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం కి, టీఆర్‌ఎస్‌కి దరిద్రం వెంటాడుతోందని, సీఎం వాళ్ల సొంత మంత్రులకే దొరకడు కదా… మూడు మూడు నెలలు ఫార్మ్ హౌస్ లో పడుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని, ఆ వైఫల్యాలను కేంద్రం పై మోపే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మాటలు ప్రజలు నమ్మరని ఇక ఆ పార్టీ అధికారంలోకి రాదంటూ ఆయన జోస్యం చెప్పారు.
