Site icon NTV Telugu

Azharuddin: హెచ్‌సీఏ నిధుల కేసు.. అజారుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

Azaruddin

Azaruddin

Azharuddin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ స్థానాన్ని కేటాయించింది. ఇప్పటికే కోర్టు నుంచి బి ఫారం అందుకున్నాడు. తదుపరి దశ నామినేషన్లు వేయడం. అయితే నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఆయనకు పెద్ద సమస్యే ఎదురైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యవహారంలో అతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. అవి నాన్ బెయిలబుల్ కేసులు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అజారుద్దీన్ మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అజహర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఈరోజు బెయిల్‌పై తీర్పు వెలువడనుంది. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ రాకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే ఆయన నామినేషన్‌కు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసుల కారణంగా ఎన్నికల్లో పోటీ చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో బెయిల్ తీర్పు కోసం అజారుద్దీన్ ఎదురు చూస్తున్నారు. బెయిల్ లభించడంతో అజారుద్దీన్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. హెచ్‌సీఏలో కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అజారుద్దీన్‌పై కేసు నమోదైంది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ ఆయనపై 4 కేసులు నమోదు చేసింది.

2020 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో కోట్లాది రూపాయల నిధులు అవినీతికి పాల్పడినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. క్రికెట్ బంతుల కొనుగోలులో భారీ మోసం జరిగినట్లు తేలింది. ఒక్కో బంతికి రూ.392కి బదులు రూ.1400 వర్క్ ఆర్డర్ ఉన్నట్లు గుర్తించింది. కేవలం క్రికెట్ బంతుల కొనుగోలు పేరుతోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షల నష్టం వాటిల్లిందని కమిటీ ఆడిట్‌లో తేలింది. బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాలు, జిమ్ పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆడిట్ నివేదిక పేర్కొంది. దీంతో ఉప్పల్ పోలీసులు అజారుద్దీన్‌పై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగియగా, నేడు తీర్పు వెలువడనుంది.

Exit mobile version