NTV Telugu Site icon

వాట్సాప్ చాటింగులను పరిశీలిస్తున్న పోలీసులు.. వివరణ ఇచ్చిన సీపీ

హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్‌పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్ ఫోన్లను సైతం పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.

Read Also: హిందూపురంలో విజిలెన్స్ దాడులు

ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇద్దరు గంజాయి సప్లై చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నరసింగ్ సింగ్, రామవత్ రమేష్‌ను అరెస్ట్ చేశామన్నారు. వీరు ఇద్దరికి వేరే రాష్ట్రాలతో లింక్స్ ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇద్దరి నుంచి 70 కిలోల గంజాయితో పాటు ఆటోను సీజ్ చేశామన్నారు. గంజాయి కొనుగోలు అంతా గూగుల్‌పే ద్వారా చెల్లిస్తున్నట్లు తేలిందన్నారు. 2021 లో 114 పీడీ యాక్ట్‌లు నమోదు చేయగా… ఇందులో 31 మంది డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారు ఉన్నారని సీపీ తెలిపారు. అటు ఏదైనా కేసులో టెక్నికల్‌గానూ విచారణ చేయాల్సి ఉంటుందని సీపీ అంజనీకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అన్ని యూనివర్సిటీల కంటే వాట్సాప్ యూనివర్సిటీ చాలా పెద్దదన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు 50వేల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయని, ప్రతి వీడియోపై పోలీస్ నిఘా అంటే కొంత కష్టమేనన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తను గుడ్డిగా నమ్మవద్దని సీపీ సూచించారు.