Site icon NTV Telugu

Heavy Rains: వాయుగుండంగా అల్పపీడనం..! భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఈనెల 27న ఉత్తర కోస్తా తీరాన్ని తాకే ఛాన్స్‌ ఉంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈరోజు నుంచి ఈనెల 29వరకు ఆంధ్రప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏలూరు, పశ్చిమగోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కోస్తా తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు అధికారులు.

Read Also: Rithu Sahu Case: రీతు సాహు కేసులో కొత్త ట్విస్ట్..! సీబీఐ ఎంట్రీతో..

ఇవాళ రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. రేపు ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. మరో రెండ్రోజులు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.

భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపోర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు అధికారులు. మరోవైపు…కృష్ణా, గోదావరి నదుల్లో ప్రస్తుతం వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీపరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

Exit mobile version