Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక, రాత్రంతా కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
Read Also: Hyderabad: పదో తరగతి పరిచయం.. ఇరువురి మధ్య ఆకర్షణ.. అందరికీ తెలియడంతో జంట ఆత్మహత్య..!
అయితే, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలి.. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలి.. అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేసింది.
