NTV Telugu Site icon

హైదరాబాద్‌లో దారుణం.. రూ.2వేలు కోసం స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్‌షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు.

Read Also: పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్

అయితే ఓ రోజు సోనూ తన స్నేహితుడు అల్తాఫ్‌కు రూ.2వేలు అప్పుగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వాళ్లిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో తాను అప్పుగా ఇచ్చిన రూ.2వేలు ఇవ్వాలని అల్తాఫ్‌ను సోనూ అడిగాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త గొడవగా మారింది. అల్తాఫ్ కోపంతో ఊగిపోయాడు. తన మటన్ షాపులోని కత్తితో సోనూపై దాడి చేశాడు. అతడి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా పోలీసులు సోనూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.