DSC Recruitment Process: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ నెలాఖరు నుంచి చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రాథమిక కీ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే.. అభ్యంతరాలను పరిశీలించి తుది కీని ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్షల అభ్యర్థుల వివరాలను క్రోడీకరించారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి సారించారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం వల్ల ఫలితాలు సులువుగా ప్రకటించవచ్చని అధికారులు చెబుతున్నారు. తుది కీ విడుదల చేసిన రోజునో.. లేదా మరుసటి రోజునో ఫలితాలు ప్రకటించవచ్చు. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితా రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,79,957 మంది పరీక్షకు హాజరయ్యారు.
Read also: Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల శాసనసభలో చెప్పారు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తాం. అయితే వర్గీకరణపై తీర్పు రాకముందే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకరణ అంశాన్ని జోడిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వర్గీకరణ అంశం ముందుకు వస్తే.. నిర్ణీత తేదీల్లో ఉపాధ్యాయుల నియామకం కష్టసాధ్యమనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
ఇక జిల్లాల వారీగా పోస్టులు, ఇతర అంశాలకు సంబంధించిన డేటాను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలో రోస్టర్ విధానంలో తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తీసుకురావడానికి అన్ని జిల్లాల పోలీసు అధికారులకు జాబితాలను కేంద్ర కార్యాలయం నుండి పంపాలని భావిస్తున్నారు. సెప్టెంబరు మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నాలుగో వారం నుంచి జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. అయితే అక్టోబర్ నెలాఖరులోగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..