CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్‌ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్‌ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..