NTV Telugu Site icon

BRS Dharna: నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ రావు..

Ktr

Ktr

BRS Dharna: రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనున్నది. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్‌ సర్కార్‌లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల కేడర్‌ను సమాయత్తపరిచి కార్యక్రమ విజయానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కేటీఆర్‌ బుధవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Read also: Kalki 2898 AD: కల్కి ఆగమనం.. ఓటీటీలో చూసేయండిక!

ముఖ్యమంత్రి రూ. 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని చెబుతున్న వైనాన్ని రైతాంగానికి తెలిపేలా కార్యాచరణను పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికలు కాగానే రుణమాఫీకి రూ.40 వేల కోట్ల అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొని, మంత్రివర్గ సమావేశం రూ.31 వేల కోట్లకే అనుమతిచ్చారు. రుణమాఫీకి బడ్జెట్లో రూ.26వేల కోట్లకు ఆమోదం తెలిపి, కేవలం రూ.18వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని ప్రతీ రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కనీసం 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధిచేకూరలేదని సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వ వైఖరిపై రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తారని భావిస్తున్నారు.
Karnataka High Court : బ్రాండెడ్ బట్టలు వేసుకుంటా.. భరణంగా రూ.6 లక్షలు ఇవ్వాల్సిందే.. కంగుతిన్న జడ్జి