NTV Telugu Site icon

Old City Bonalu: పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Old City Bonalu

Old City Bonalu

Old City Bonalu: భాగ్యనరంలోని పాతబస్తీ సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. జాతర సందర్భంగా లాల్ దర్వాజ ముస్తాబు అయ్యింది. పాత బస్తీలోని సింహవాహిని ఆలయంతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జులై 28వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 5.30 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాగా.. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Read also: Jagadish Reddy: విహార యాత్రలు కాంగ్రెస్ నేతలకు అలవాటు.. జీవన్ రెడ్డికి జగదీష్ రెడ్డి కౌంటర్

మరోవైపు కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మీరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక.. లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

Read also: Ponnam Prabhakar: ఆగస్టు 2 వస్తుంది పోతుంది.. కేటీఆర్ కు పొన్నం కౌంటర్..

కాగా.. లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాత బస్తీలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, బహుదూర్‌పురా, మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈనెల 28, 29 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు పాతబస్తీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగుతుంది. కాగా.. లాల్ దర్వాజ దేవాలయం, ఎంజీబీఎస్, రెతిఫైల్, జేబీఎస్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు… సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.

Read also: Komatireddy Vs Harish: అసెంబ్లీలో కోమటిరెడ్డి – హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం..

వాహనాల మళ్లింపు

* హిమ్మత్‌పురా నుంచి షంషీర్‌గంజ్ వైపు వెళ్లే వాహనాలను గౌలిపురా, సుధా టాకీస్ మీదుగా మళ్లిస్తారు.
* చాంద్రాయణగుట్ట, ఉప్పగూడ నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను గౌలిపుర, నాగుల్చింత మీదుగా మళ్లిస్తారు.
* మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను జహనుమా, గోశాల, తాడ్‌బాన్, ఖిలావత్ మీదుగా మళ్లిస్తారు.
* ఇంజిన్ బౌలి నుండి షంషీర్‌గంజ్ వైపు వచ్చే వాహనాలను మళ్లించడం
* చార్మినార్ నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి వద్ద మళ్లిస్తారు
* చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనాలను పురానా హవేలీ రోడ్డు, శివాజీ బ్రిడ్జి వద్ద మళ్లిస్తారు
* మొగల్‌పురా, మీర్‌చౌక్‌ నుంచి వచ్చే వాహనాలను మీర్‌ కా డియారా వైపు మళ్లించనున్నారు.
Harish Rao vs Bhatti Vikramarka: నేను ఒప్పుకున్నానా..? హరీష్ పై భట్టి ఫైర్