Site icon NTV Telugu

Hyderabad: నంబర్‌ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక.. అలా చేస్తే జైలుకే..!!

Number Plates

Number Plates

Hyderabad Traffic Police Warning: హైదరాబాద్ నగరంలో చలాన్లు పడకుండా కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్ కనబడకుండా చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ తీసేయడం, మాస్కు కట్టడం, ప్రింట్ తుడిచేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు నేరస్తులు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాల నంబర్ ప్లేట్‌లు టాంపిరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనానికి నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై ఛార్జీషీట్ వేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. నంబర్‌ప్లేట్‌కు మాస్క్ కట్టినా నేరంగానే పరిగణిస్తామన్నారు.

కాగా వాహనం నంబర్‌ ప్లేట్‌ సక్రమంగా ఉన్న వారు నిబంధనలు పాటిస్తారు, నంబర్‌ప్లేట్‌ సరిగ్గా లేని వారు తమనెవరూ పట్టుకోరనే ధీమాతో ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల క్రితం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో 100కుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో వాహనం ఎవరి పేరుపై ఉంటుందో వారే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అటు షోరూం నుంచి వాహనం కొనుగోలు చేసిన నెలరోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version