Fraud: హైదరాబాద్ లో క్రిప్టో కరెన్సీ ముసుగులో మరో భారీ ఆర్థిక నేరం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్ ‘తాజ్ డెక్కన్’ పార్కింగ్ లో సినిమా ఫక్కీలో ఒక వ్యక్తి నుండి ఏకంగా కోటి రూపాయల నగదును కాజేసి కేటుగాడు ఉడాయించాడు. అధిక లాభాల ఆశ చూపి నమ్మక ద్రోహానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..? బాధితుడు అత్తాపూర్‌కు చెందిన వ్యక్తి. అయితే.. తనకు తెలిసిన ఒక స్నేహితుడి ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయన్న సమాచారంతో సదరు బాధితుడు ఈ వ్యవహారంలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక మీడియేటర్ ద్వారా నిందితుడిని పరిచయం చేసుకున్నాడు. పెట్టుబడి పెడితే ఊహించని రీతిలో లాభాలు ఇప్పిస్తామని నమ్మించిన నిందితుడు, నగదుతో బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్ వద్దకు రావాలని బాధితుడికి సూచించాడు.
అతని మాటలు నమ్మిన బాధితుడు కోటి రూపాయల నగదును సిద్ధం చేసుకుని హోటల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ హోటల్ పార్కింగ్ ప్లేస్‌లో నగదును అందుకున్న సదరు కేటుగాడు, బాధితుడి కళ్లుగప్పి ఆ భారీ మొత్తంతో క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి పంజాగుట్ట పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హోటల్ ప్రాంగణంలోని, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. తెలిసిన వారే కదా అని నమ్మి భారీ మొత్తంలో నగదును అపరిచితుల చేతిలో పెట్టవద్దని, ఇటువంటి క్రిప్టో కరెన్సీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Bhatti Vikramakra : విద్యుత్ ఉద్యోగులకు భట్టి కానుక.. 17.651 శాతం డీఏ ఖరారు..
